Monday 12 March 2012

యాదవులు రాజకీయంగా ఎదగాలి

ఒంగోలు అర్బన్, మార్చి 4: రాష్ట్రంలోని యాదవులందరు ఒకతాటిపై నిలిచి రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర మాథ్యమిక విద్యాశాఖ మంత్రి కె పార్థసారధి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఒక కులం బలం చూసుకుని రాజకీయంగా ఎదగలేమని, అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్ళగలిగితే యాదవులు రాజకీయంగా ఎదగగలరని అన్నారు. ఆదివారం ఒంగోలులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పార్థసారధి మాట్లాడుతూ కాటంరాజు పాలించిన ఈ ప్రాంతంలో యాదవులు రాజకీయంగా ఎదిగి పది మందికి సేవ చేయాలని సూచించారు. భగవంతుడు తనను ఆశీర్వదిస్తే తప్పకుండా యాదవులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే యాదవులు నాలుగు సంఘాలుగా విడిపోవడం బాధగా ఉందన్నారు. గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. జిల్లాలో ఒకేఒక్క నాయకత్వం ఉన్నప్పుడు ప్రజా ప్రతినిధులుగా ఎదిగేందుకు అవకాశం ఉందన్నారు. ఆదిశగా చర్యలు చేపట్టకపోతే మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. గౌడ, చేనేత కార్మికులు, దళితులు, మైనార్టీలను అన్ని ప్రాంతాలలో అణగదొక్కుతున్నారని, వారందరితో కలిసి ఒక శక్తిగా ఎదిగి సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యను అందిస్తున్నారని ప్రతి పిల్లవాడ్ని కార్పొరేట్ కళాశాలలో కాకుండా ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలన్నారు. బలహీన వర్గాలను ఆదుకునేందుకు బడ్జెట్‌లో 120 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకందారులందరికి ఎన్‌సిటిఇ ద్వారా రుణాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని యాదవులకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని పార్థసారధి హామీ ఇచ్చారు. అనంతరం ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ యాదవుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. పార్టీపరంగా, వ్యక్తిగతంగా సహాయం చేస్తామన్నారు. తమ కుటుంబానికి యాదవ సోదరులకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని, యాదవులకు ఎల్లప్పుడు అండగా ఉంటానని మాగుంట భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కనిగిరి శాసనసభ్యుడు ముక్కు ఉగ్రనర్సింహారెడ్డి మాట్లాడుతూ యాదవులు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లాలోని బిసి కార్పొరేషన్‌కు 120 కోట్ల రూపాయల కేటాయించినట్లు, తద్వారా బిసి కులాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున యాదవులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు కేటాయిస్తామని రాష్ట్ర మాజీ మంత్రి, జగన్ వర్గం నేత బాలినేని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి యాదవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రెండు సీట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పటివరకు తాను ఒంగోలులో హ్యాట్రిక్ సాధించానంటే తన గెలుపులో యాదవ సోదరులు ప్రధానపాత్ర పోషించారన్నారు. జిల్లాలో బలమైన శక్తిగా యాదవులు ఉన్నారని, వారందరికీ తానెల్లప్పుడు రుణపడి ఉంటామన్నారు. యాదవుల సహాయం మరువలేనిదని, యాదవులకు తమ పార్టీలో ఇప్పటికే సముచిత స్థానం కల్పించామన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నూకసాని బాలాజీ, జిల్లా అధికార ప్రతినిధిగా కె రామచంద్రరావులను నియమించామని తెలిపారు. తనకు ఎల్లప్పుడు అండగా ఉండాలని యాదవులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు రాచగర్ల వెంకట్రావు యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు అసెంబ్లీ ఎన్నికల్లో మూడు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ అయితే యాదవులకు సీట్లు కేటాయిస్తుందో పూర్తిస్థాయిలో ఆపార్టీకే మద్దతు ప్రకటించి గెలిపించుకుంటామన్నారు. మహాసభ రాష్ట్ర యువజన అధ్యక్షుడు వై చక్రాధర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీలు ఒకే సామాజిక వర్గానికి టికెట్ ఇస్తున్నాయని, ఇతర కులాలకు కేటాయిస్తే తమ సత్తా చాటుతామన్నారు. కొన్ని నియోజకవర్గాలలో తమ సంఖ్య బలంగా ఉన్నా తమపై వివక్ష చూపుతున్నారని అన్నారు. యాదవులకు సముచిత స్థానం కల్పించిన పార్టీలకు అండగా నిలుస్తామన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి పార్థసారధి డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు. తరువాత మంత్రిని గజమాలతో ఘనంగా సత్కరించారు. ముందుగా బిసి కార్పొరేషన్ చైర్మన్ బిపి మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బొర్రా పూర్ణచంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి భిక్షపతి యాదవ్, ప్రకాశం, కృష్ణాజిల్లాల జడ్‌పి మాజీ చైర్మన్‌లు కాటం అరుణమ్మ, కె నాగేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్‌రాజు, దారా సాంబయ్య, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మాజీ మున్సిపల్ చైర్మన్ బాపట్ల హనుమంతురావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి యర్రాకుల శ్రీనివాస్ యాదవ్, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, జిల్లా నలుమూలల నుండి యాదవులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.